ముంబై : అటు ఇంగ్లండ్ లో ఇటు ఐర్లాండ్ తో వరుస టి20 సీరీస్ లు కోల్పోయింది భారత జట్టు. దీంతో జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్ ను ఏకి పారేస్తున్నారు. ఈ సమయంలో మరోసారి సూర్య కుమార్ యాదవ్ ను తీసుకోవాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ప్రపంచ కప్ విజయంలో భారత్‌కు నాయకత్వం వహించిన సూర్యకుమార్ ఐర్లాండ్ , ఇంగ్లాండ్ పర్యటనలకు ముందు బ్యాటింగ్‌లో పేలవమైన ఫామ్ కారణంగా టి20 కెప్టెన్సీని కోల్పోయాడు. అంతే కాకుండా జట్టు నుండి తొలగించబడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తే సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులోకి తిరిగి రాగలడని భారత క్రికెట్ నియంత్రణ మండలి వర్గాలు తెలిపాయి.
ఈ సమయంలో సూర్య భాయ్ స్థానంలో ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు పొందిన శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త టి20 జట్టుకు స్కిప్పర్ గా నియమించింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్. అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు ప్రదర్శన క్షీణించింది. ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 4-0తో ఓటమిని చవిచూసింది. ప్రస్తుత ప్రణాళికల్లో లేనప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తే సూర్యకుమార్ పునరాగమనానికి ఛాన్స్ లేక పోలేదని పేర్కొంది. ఇకపై భారత్ తన దృష్టిని ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌పై సారించనుంది; ఈ సిరీస్ కోసం అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ జట్టులోకి తిరిగి రానున్నారు.

















