వచ్చే ఏడాది నుంచి ఏటీసీలలో నైపుణ్య పోటీలు

ఉత్తమ ఆవిష్కర్తలుగా నిలిచిన వారికి ఉద్యోగాలు

hellotelugu-Vivek

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ‘అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను కేవలం యువతకు ఉద్యోగ శిక్షణనిచ్చే కేంద్రాలుగానే కాకుండా, వారి సృజనాత్మకతను వెలికితీసి ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దే వేదికలుగా మారుస్తోందని కార్మిక‌, గనుల శాఖ‌ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. 10వ తరగతి పూర్తి చేసి ఏటీసీలలో రెండేళ్ల శిక్షణ పొందుతున్న విద్యార్థులు స్వయంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయగలగడం, రాష్ట్ర నైపుణ్య శిక్షణ వ్యవస్థకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

మంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు ఏటీసీని సందర్శించారు. విద్యార్థులు పార్థసారథి, స్ఫూర్తి రూపొందించిన వినూత్న ఎలక్ట్రిక్ వాహనాలను ఆయన పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు; అలాగే విద్యార్థులతో మాట్లాడి వారి ఆవిష్కరణల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మనుగూరు ఏటీసీలో శిక్షణ పూర్తి చేసుకుని వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటీసీలలో చదువుతున్న ప్రతి విద్యార్థికీ నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందిస్తూనే, విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. శిక్షణ పొందిన విద్యార్థులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, కొత్త ఆవిష్కరణలు చేసే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 119 ఏటీసీలలో వచ్చే ఏడాది నుంచి ఏటా నైపుణ్య పోటీలు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. పోటీలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ఆవిష్కర్తలను గుర్తిస్తామని ఆయన తెలిపారు. ఉత్తమ ఆవిష్కర్తలుగా నిలిచిన మొదటి 10 మందికి ప్రత్యేక అవార్డులు, ప్రోత్సాహకాలు అందించడంతో పాటు, ఏటీసీలలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చుకుని, ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రోత్సహిస్తామని ప్ర‌క‌టించారు. విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను కేవలం ప్రదర్శనలకే పరిమితం చేయకుండా, వాణిజ్య స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి తీసుకు రావడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

టాటా గ్రూప్‌ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 119 ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సుమారు రూ. 4,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో సాంకేతిక శిక్షణా కేంద్రాల అభివృద్ధికి టాటా గ్రూప్ సహకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. మారుతున్న పరిశ్రమ సాంకేతికతలకు అనుగుణంగా కొత్త పాఠ్య ప్రణాళికలు , ఆధునిక కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. పాత ఐటీఐలలోని కోర్సులు పరిశ్రమ అవసరాలను తీర్చలేక పోవడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని ఆయన గుర్తించారు. ఈ సమస్యను అధిగమించడానికి ఏటీసీల‌ను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వివరించారు.

తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. విదేశీ ఉపాధి అవకాశాలను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం TOMCOM ద్వారా రూ. 90 కోట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. జర్మనీ, జపాన్ వంటి దేశాలలో ఉద్యోగాల కోసం యువతను సిద్ధం చేయడానికి జర్మన్ , జపనీస్ వంటి విదేశీ భాషలలో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

Exit mobile version