హైదరాబాద్ : హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిపోయిన ఘటన స్థలాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. సీఎంసీ కమిషనర్ సృజన్, హైడ్రా అదనపు డైరెక్టర్ వార్ల పాపయ్యతో కలిసి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. భవనం కూలి పోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. అలాగే, సరైన అనుమతులు లేకుండా ఆ పరిసరాల్లో నిర్మించిన భవనాలను కూడా పరిశీలించారు. కూలిపోయిన ఏడంతస్తుల భవనం ప్రభావానికి గురైన జయదర్శిని అపార్ట్‌మెంట్‌ను కూడా వారు తనిఖీ చేశారు. భవనంలోని అన్ని అంతస్తులను పరిశీలించారు. అపార్ట్‌మెంట్ నివాసితులతో మాట్లాడి, శిథిలాలను వెంటనే తొలగిస్తామని, ఆ తర్వాత భవన నిర్మాణ దృఢత్వాన్ని అంచనా వేసి ధృవీకరిస్తామని చెప్పారు కమిషనర్. అప్పటి వరకు అపార్ట్‌మెంట్‌లో ప్రభావితమైన భాగాల్లో ఎవరూ ఉండకూడదని సూచించారు. ఘటన స్థలంలో హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్ , ఎస్‌డీఆర్‌ఎఫ్ , సీఎంసీ , పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న సహాయక చర్యలను సమీక్షించారు.
అనంతరం ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. అంజయ్యనగర్‌లో కాలువను ఆనుకుని అనుమతి లేకుండా అనేక భవనాలు నిర్మించారని పేర్కొన్నారు. కేవలం 50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనాలను నిర్మిస్తూ నివాసితుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని తెలిపారు. బిల్డర్ సాజిద్ నిర్మించిన భవనాలన్నీ ఇలాగే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారని, కొన్ని రోజుల్లోనే ఈ భవనాలన్నింటినీ తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అంజయ్యనగర్‌లో ఇలాంటి భవనాలు చాలా ఉన్నాయని, వాటికి ఎటువంటి ‘సెట్‌బ్యాక్స్’ (భవనం చుట్టూ ఖాళీ స్థలం) లేవని ఆయన అన్నారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ప్రమాదకర భవనాలను తప్పనిసరిగా కూల్చివేయాలని ఆయన స్పష్టం చేశారు. సీఎంసీతో కలిసి అంజయ్యనగర్‌లో ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. ఈ సందర్భంగా అంజయ్యనగర్‌లోని పలు భవనాలను పరిశీలించారు. సీఎంసీ కమిషనర్ సృజన్ కూడా మాట్లాడుతూ ఈ భవనంపై ముందే ఫిర్యాదు అంది ఉంటే పనులు నిలిపి వేసేవారమని, కానీ పనులు తిరిగి మొదలైన సమయంలోనే అది కూలిపోయిందని తెలిపారు. హైడ్రాతో కలిసి అన్ని భవనాలను తనిఖీ చేసి కూల్చివేస్తామని హెచ్చరించారు.
