ముంబై : కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ పూణే కార్యక్రమానికి ‘విదేశీ నిధుల’ ఆరోపణలపై విచారణకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. పూణేలో పార్టీ నేత రాహుల్ గాంధీ కార్యక్రమానికి విద్యార్థులను తరలించే విషయంలో కాంగ్రెస్ విదేశీ నిధులను వినియోగిస్తోందంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై సీఎం సీరియస్ గా స్పందించారు. విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు కాంగ్రెస్ రూ. 30,000 నుండి రూ. 35,000 వరకు ఆఫర్ చేస్తోందని మహారాష్ట్ర బీజేపీ ప్రధాన ప్రతినిధి నవనాథ్ బాన్ ఆరోపించారు. సుమారు 3,000 మందిని తరలించడానికి రూ. 9-10 కోట్ల ఖర్చు అవుతుందని పేర్కొన్న ఆయన, ఆ నిధుల మూలంపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా నవనాథ్ చేసిన కామెంట్స్ ను తాము సీరియస్ గా తీసుకున్నామని పేర్కొన్నారు సీఎం.
రాహుల్ గాంధీ కార్యక్రమంపై జరిగిన ఖర్చు ఎంత ఎక్కువగా ఉందంటే, దానిని విద్యార్థుల గళం అని కాకుండా డబ్బుల హోరు అని పిలవాలని బాన్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పీపీపీ మోడల్ అంటే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కాదని , అది డబ్బుతో కూడిన రాజకీయ కార్యక్రమం అని బాన్ వ్యాఖ్యానించారు; డబ్బు ఆధారిత ప్రచారం ద్వారా రాహుల్ గాంధీని రాజకీయంగా మళ్లీ పరిచయం చేయడానికి పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఆరోపించిన ఖర్చుకు విదేశీ నిధులతో ఏమైనా సంబంధం ఉందా అని కూడా ఆయన ప్రశ్నించారు. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో కాంట్రాక్టర్ల కమీషన్ల ద్వారా సమకూరిన డబ్బును మహారాష్ట్రలోని రాజకీయ కార్యకలాపాలకు మళ్లిస్తున్నారా అనే అంశంపై విచారణ జరగాలని బాన్ డిమాండ్ చేశారు.
