హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సర్ ప్రక్రియపై ఆయన స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. సర్ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. దీనిపై రాజకీయాలను ఆపాదించడం సరికాదన్నారు. దీనిని కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ , ఇతర రాష్ట్రాలలో నిర్వహించిన ఇలాంటి డ్రైవ్‌లతో పోలుస్తూ, వ్యత్యాసాలను గుర్తించి, తొలగించడం ద్వారా ఓటర్ల జాబితాను మెరుగు పరచడమే ఎస్ఐఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. దీని గురించి ఎందుకు రాద్దాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు బీజేపీ చీఫ్.
రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)కు ఎలాంటి రాజకీయ కోణాలు లేవని కుడ బద్దలు కొట్టారు. ఇది భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టే ఒక సాధారణ ప్రక్రియ మాత్రమేనని మరోసారి నొక్కి చెప్పారు. బెంగాల్ , ఇతర ప్రాంతాలలో మాదిరిగానే నకిలీ ఓటర్లను గుర్తించడం, అక్రమ వలసదారులు ఉన్నచోట వారిని పంపించడం చేస్తారన్నారు. దీనికి భయపడితే ఎలా అని ప్రశ్నించారు రామచందర్ రావు. బెంగాల్ చేసింది లేదా ఎస్ఐఆర్ చేసింది ఏమిటంటే, గుర్తించడం, తొలగించడం, బహిష్కరించడం మాత్రమేనని పేర్కొన్నారు. కాబట్టి ఓటర్ల జాబితాలో నిజమైన పేర్లు ఉన్నాయా, అందులో నకిలీ ఓటర్లు ఎవరైనా ఉన్నారా, మరణించిన ఓటర్లు ఎవరైనా ఉన్నారా, లేదా బదిలీ చేయబడిన, తరలివెళ్లిన ఓటర్లు ఎవరైనా ఉన్నారా అని చూస్తారని చెప్పారు. సర్ పై అనవసర రాద్దాంతం చేయొద్దని హితవు పలికారు.
