అమరావతి : తెనాలిలో మా–ఏపీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2026 పోటీల్లో విజయం సాధించిన యువ దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వెలగపూడి సచివాలయంలోని ఛాంబర్ లో ఘనంగా సత్కరించడమే కాకుండా జ్ఞాపికలు అందజేశారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు 203 ఎంట్రీలు రావడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది నటీనటులు ఈ పోటీల్లో పాల్గొనడం ఏపీ యువతలోని సృజనాత్మక శక్తికి నిదర్శనం అన్నారు మంత్రి.
ఈ పోటీల్లో విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ శకునాల తెరకెక్కించిన ‘మహావృక్షం’ ప్రథమ బహుమతి, శ్రీకాకుళానికి చెందిన శ్రీనివాసరావు రూపొందించిన ‘సింహాద్రి అప్పన్న’ ద్వితీయ బహుమతి, పాలకొల్లుకు చెందిన నవీన్ కుమార్ తీసిన ‘అబద్ధం వర్సెస్ నిజం’ తృతీయ బహుమతి సాధించాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతిని అంద చేశారు కందుల దుర్గేష్. అలాగే ఉత్తమ నటీనటులు, యంగ్ టాలెంట్, డెబ్యూ డైరెక్టర్, స్క్రిప్ట్ పరిశీలకులు తదితర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారందరినీ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2026 పోటీల్లో విజేతలుగా నిలిచిన వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, “మా – ఏపీ” సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ సినీ దర్శకులు దిలీప్ రాజా ను ప్రత్యేకంగా మంత్రి అభినందించారు.
