రైతుల కోసం ముందుగానే విత్తనాల సిద్ధం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ కూట‌మి స‌ర్కార్

hellotelugu-APseeds

అమరావ‌తి : వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌ని ఏపీ కూట‌మి స‌ర్కార్ వెల్ల‌డించింది. మొదటి విడతలో 47,321 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయడంతో పాటు, ఆగస్టు 15 తర్వాత ఏర్పడే అదనపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 1.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆగస్టు 3 నుంచే ఆర్‌ఎస్‌కేలు, మండల స్థాయిలో ‘రైతన్నా మీకోసం’ వారోత్సవాల ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అదేవిధంగా 6.30 లక్షల హెక్టార్లలో PMFBY, RWBCIS కింద పంటల బీమా కవరేజీ కల్పించామని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వరి బీమా నమోదుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు నెలలకు సరిపడా పశుగ్రాసం అందుబాటులో ఉందన్నారు.

పశుగ్రాసం అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి కొరత ఉన్న జిల్లాలకు తరలించేందుకు ఇప్పటికే స్పష్టమైన ట్రాన్స్‌పోర్ట్‌ ప్లాన్‌ను సిద్ధం చేశామని చెప్పారు. పశువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న సమయంలో జగన్ మోహన్‌రెడ్డి ఎందుకు మౌనం వహించారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాల్లో అప్పటి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. రైతులు, వ్యవసాయం, నీటి వనరుల ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు శాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతి రైతును.. ప్రతి పంటను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం రాత్రింబవళ్లు పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

Exit mobile version