మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు సురక్షితమేనా..?

ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ పై హైకోర్టు వేటు

hellotelugu-BRSMLAs

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సంచ‌ల‌న తీర్పు ఇప్పుడు ఆయా పార్టీల‌లో ఉన్న నాయ‌కుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికి కార‌ణం త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన , ఎప్పుడు ప‌డితే అప్పుడు పార్టీల‌లో చేర‌డం, కండువా క‌ప్పుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత నోటీసు జారీ చేసినప్పటికీ, కాంగ్రెస్ వైపు వెళ్ళిన మిగిలిన 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా సురక్షిత స్థితిలోనే ఉన్నారు. కాంగ్రెస్ ‘బి-ఫారం’పై సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేయడం, ఆ పార్టీ వేసిన కౌంటర్ పిటిషన్‌కు బలమైన చట్టపరమైన ఆధారంగా మారింది.

మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో అధికారికంగా చేరినట్లు ఎటువంటి పత్రాలూ దాఖలు చేయలేదు, అలాగే వేరే ఏ పార్టీ ‘బి-ఫారాలను’ కూడా సమర్పించలేదు. కేవలం బయట కనిపించే పరిణామాలు, ఫోటోలు , పత్రికా కథనాలు మాత్రమే కోర్టులలో చట్టపరమైన వాదనలకు లేదా కౌంటర్ పిటిషన్లకు చెల్లుబాటు అయ్యే సాక్ష్యాలుగా నిలవవని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ రికార్డులలో వీరంతా ఇప్పటికీ కేసీఆర్ సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ సభ్యులుగానే నమోదై ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నప్పటికీ, మిగిలిన ఎమ్మెల్యేల సభ్యత్వానికి తక్షణమే ఎటువంటి చట్టపరమైన ముప్పు లేదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఓ చెంప పెట్టు లాంటిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Exit mobile version