విధులకు గైర్హాజరయ్యే టీచ‌ర్ల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

జోగులాంబ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

hellotelugu-Collector

జోగులాంబ గ‌ద్వాల జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ను పటిష్టంగా అమలు చేసి విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ బెటాలియన్‌లోని విద్యా బోధన ,ప్రాథమిక అక్షరాస్యత , సంఖ్యా నైపుణ్యాలు సాధికార పాఠశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక అక్షరాస్యత , సంఖ్యా నైపుణ్యాలు (ఎఫ్‌ఎల్‌ఎన్‌)ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం,సంఖ్యా నైపుణ్యాల్లో ఆశించిన అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో ఎఫ్‌ఎల్‌ఎన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, విద్యార్థుల అభ్యసన శాతాన్ని పెంచాలన్నారు. విద్యార్థుల 100 శాతం హాజరును ఉండేలా చూడాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ ట్రాకింగ్ రిజిస్టర్‌ను సబ్జెక్టు వారీగా తప్పనిసరిగా నిర్వహిస్తూ, ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని నమోదు చేయాలన్నారు.

ఎఫ్‌ఎల్‌ఎన్‌ బేస్‌లైన్‌ రిపోర్ట్‌ ఆధారంగా విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించి, తగిన బోధనా వ్యూహాలతో అదనపు బోధన అందిస్తూ వారి నైపుణ్యాలను మెరుగు పరచాలన్నారు. ప్రతి బుధవారం ప్రధానోపాధ్యాయులు సమావేశం నిర్వహించి, విద్యార్థుల అభ్యసన పురోగతిని సమీక్షించి, మెరుగుదలకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగు పరిచేందుకు ఉపాధ్యాయులు సృజనాత్మకమైన, వినూత్న బోధనా పద్ధతులను అనుసరించాలన్నారు. ప్యానెల్‌ తనిఖీ బృందాలు షెడ్యూల్‌ ప్రకారం పాఠశాలలను సందర్శించి, విద్యా ప్రమాణాలు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలు, మౌలిక వసతులను సమగ్రంగా పరిశీలించాలన్నారు. పాఠశాలలోని సానుకూల అంశాలు, లోపాలను స్పష్టంగా నమోదు చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ నివేదికల ఆధారంగా లోపాలను పరిష్కరించి, పాఠశాలల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌ సభ్యులు ఉత్తమ బోధనా పద్ధతులను గుర్తించి డాక్యుమెంటేషన్‌ చేయాలన్నారు. ప్యానెల్‌ తనిఖీ బృందాల పనితీరు, పాఠశాలల పరిస్థితిపై నివేదికలు సేకరించి, వాటి ఆధారంగా ఎఫ్‌ఎల్ యెన్ ను మరింత మెరుగు పరచాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ 100 శాతం ఉండాలన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు వేసి అనంతరం ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నట్లు నివేదికలు అందుతున్నాయని తెలిపారు. దీనిపై సమీక్ష అనంతరం కొద్ది రోజుల్లోనే సంబంధిత ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు ప్రతి నెల 15వ తేదీ లోపు పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించి, పాఠశాలలో విద్యా బోధన, మౌలిక వసతులు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలను పరిశీలించాలన్నారు. టాయిలెట్‌ సౌకర్యం లేని పాఠశాలల వివరాలతో నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. ఆధార్‌, అపార్‌, ఎస్‌హెచ్‌వీఆర్‌, ప్రశస్త్‌ నమోదులో పురోగతిని మరింత మెరుగు పరచాలన్నారు. ఏక్ పేడ్ మా కీ నామ్, జాతీయ విద్యార్థుల పర్యావరణ పోటీ నషా ముక్త్ విద్యాలయ, డ్రగ్ ఫ్రీ కార్యక్రమం పాఠశాలలో పక్కాగా అమలు చేయాలన్నారు.

Exit mobile version