న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సమాచార హక్కు చట్టం కొందరి చుట్టంగా , బ్లాక్ మెయిల్ చేసేందుకు మార్గంగా మారిందని మండిపడింది. ఇందులో భాగంగానే తాము ఆర్టీఐ యాక్టివిస్టులకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. రోడ్డు నిర్మాణ పనుల్లో ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్టీఐ కార్యకర్తకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా జస్టిస్ సందీప్ మెహతా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీఐ కార్యకలాపాలు ఒక కొత్త వ్యాపారంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది, రోడ్డు నిర్మాణ బాధ్యతను అదే చూసుకుంటుంది. మీకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. మిమ్మల్ని మీరు ఆర్టీఐ కార్యకర్త అని పిలుచుకుంటున్నారని, ఇది పసుపు పత్రికా ధోరణి లాంటిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించింది. ఆర్టీఐ కార్యకర్త రాకేష్ కుమార్ బెహ్ల్. అతని సహచరుడికి బెయిల్ నిరాకరించింది. రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించే అధికారం వారికి ఎక్కడిదని ప్రశ్నించింది. జస్టిస్ మెహతా అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, జస్టిస్ బిష్ణోయ్ ఈ రోడ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి మీరెవరు? మీరేమైనా ఉన్నతాధికారా? లేక ఇంకేమైనానా? అని ప్రశ్నించారు. తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ పంజాబ్ , హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బెహ్ల్ సవాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లోని అవినీతిని బయటపె ట్టినందుకే తమను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.
