అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. జిల్లా స్థాయిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యోగుల పని తీరును విశ్లేషించు కోవాలని అన్నారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగానికీ కంప్యూటర్ అవగాహన తప్పనిసరి అర్హతగా చేర్చేలా సాధారణ పరిపాలన శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి జిల్లాల్లో హెచ్ఆర్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సీఎం. తద్వారా సిబ్బంది ఉద్యోగుల సామర్ధ్యాలను పెంపొందించు కోవచ్చని పేర్కొన్నారు. ప్రణాళికా విభాగం ఆన్ లైన్ కోర్సులు తీసుకు వచ్చినా ప్రాక్టికల్ నాలెడ్జి వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కౌలు రైతులకు రుణాలివ్వడానికి అడ్డంకిగా ఎలాంటి నిబంధనలు ఉండకూడదని అన్నారు.
ఏమైనా నిబంధనలు ఉంటే వాటిపై చర్చించి తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సీఎం. వ్యవసాయాన్ని రీ ఓరియంట్ చేయాలని అన్నారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన, పశుసంవర్ధక రంగాల వైపు రైతులు మళ్లాలని సూచించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల్లో మహిళా పోలీసుల సేవలను ఎవరూ వినియోగించు కోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సేవలను అవసరమున్న శాఖలు వినియోగించు కోవాలని కోరారు. ఆర్ అండ్ బి, హెల్త్, మున్సిపల్ శాఖలకు ఎక్కువగా అవసరం ఉన్నట్టుగా చెబుతున్నారని తెలిపారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లోని సిబ్బంది సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా.. ఆ మేరకు సర్దుబాటు చేసుకునేలా కలెక్టర్లకు అధికారాలు ఇస్తున్నామని వెల్లడించారు. స్వర్ణ వార్డు, గ్రామ సిబ్బంది బదిలీలు సిఫార్సుల ఆధారంగా కాదు.. అవసరానికి అనుగుణంగానే జరగాలని అన్నారు.
