రూఫ్‌టాప్ సోలార్ పనులు వేగవంతం : సీఎండీ

సమీక్షా సమావేశంలో సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి

hellotelugu-CMD

తిరుపతి : కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(రెస్కో) పరిధిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోతేటి పేర్కొన్నారు. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో రెస్కో అభివృద్ధి పనులపై డిస్కమ్, రెస్కో అధికారులతో సిఎండి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పం పరిధిలో విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ చర్యల్లో భాగంగానే పునరుత్పాదక విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కుప్పం నియోజకవర్గంలో ఎస్సీ,ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని చెప్పారు సీఎండీ. అదేవిధంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఉన్న 39,215 బీసీ వినియోగదారుల గృహాలపై కూడా సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని తెలిపారు. కుప్పం నియోజకవర్గం పరిధిలో వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు వీలుగా యేడాది కాలంలో 10 నూతన సబ్- స్టేషన్లను మంజూరు చేశామన్నారు. వాటిలో 7 సబ్-స్టేషన్ల నిర్మాణ పనులు పూర్తికాగా, మిగిలిన 3 సబ్-స్టేషన్ల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు లోతేటి.

రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం-కుసుమ్ పథకం కింద ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో ఈ పథకం కింద 751 మెగావాట్ల సామర్థ్యంతో 146 కేంద్రాల్లో సోలార్ పార్క్ లను ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 138 కేంద్రాల్లో భూసేకరణ పనులు పూర్తయ్యాయని, వాటిలో కొన్ని కేంద్రాల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, మరో 8 కేంద్రాలకు భూసేకరణను పూర్తి చేయాల్సి ఉందని వివరించారు.

Exit mobile version