బెంగళూరు : కర్ణాటకలో కరువు పీడిత తాలూకాలపై కేంద్రానికి రెండు రోజుల్లో వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా 101 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తించినట్లు తెలిపారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో కరువును ఎదుర్కోవడానికి కేంద్రం నుండి సహాయం పొందేందుకు వీలుగా ఈ నివేదికను తయారు చేశామని, దీనిని రెండు రోజుల్లో కేంద్ర సర్కార్ కు అందజేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభావిత తాలూకాలను ఈ జాబితాలో చేర్చుతామని చెప్పారు. ఈ అంచనాను మాన్యువల్‌గా (చేతితో) చేయలేదు అని ఆయన స్పష్టం చేశారు. కరువు పీడిత తాలూకాలను ప్రకటించడానికి నిర్దేశించిన ప్రమాణాలను సడలించాలని తాము కేంద్రాన్ని కోరామన్నారు.
కానీ, రాష్ట్రం చేసిన అభ్యర్థనకు కేంద్రం స్పందించ లేదన డాక్టర్ పరమేశ్వర్ ఆరోపించారు.ప్రమాణాలను సడలించక పోవడం వల్ల కొన్ని తాలూకాలు జాబితాలో చేరలేదని, అయితే రాబోయే రోజుల్లో వాటిని కూడా చేరుస్తామని ఆయన తెలిపారు. అంచనాల ప్రకారం, కరువు కారణంగా రాష్ట్రంలో పంట నష్టంతో సహా మొత్తం రూ. 18,000 కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ నష్టాల అంచనాను ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించామని ఆయన చెప్పారు. గత ఏడాది కర్ణాటక రూ. 39,000 కోట్ల నష్టాన్ని చవిచూసిందని, మార్గదర్శకాల ప్రకారం రూ. 18,000 కోట్ల సహాయం కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ అభ్యర్థనకు స్పందించ లేదని మండిపడ్డారు. ఈ ఏడాది కరువు సహాయం విషయంలో రాష్ట్ర విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకాన్ని పరమేశ్వర్ వ్యక్తం చేశారు. అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకేసారి రూ. 72,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
