హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి.
అర్హులైన ఓటర్లందరినీ తుది జాబితాలో చేర్చాలని, ప్రక్రియను పారదర్శకంగా కచ్చితత్వంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామ పంచాయతీలో సర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ పరిశీలనలో భాగంగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి పత్రాలను , ఓటర్ల జాబితాను పరిశీలించారు. అర్హులైన ఓటర్లందరూ తుది ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని, అలాగే నిబంధనల ప్రకారం మరణించిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల పేర్లను తొలగించాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా కీలకమని, సర్ ప్రక్రియలో అధికారులు పారదర్శకత , కచ్చితత్వాన్ని పాటించాలని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎటువంటి తప్పులకు తావు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని కోరారు.
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాతో కలిసి సుదర్శన్ రెడ్డి తంసి మండలంలోని ఘోట్‌కూరి గ్రామం, భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి, హౌసింగ్ బోర్డ్ కాలనీలోని టీచర్ ట్రైనింగ్ కాలేజ్ , సంజయ్ నగర్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలలో సర్ ప్రక్రియను పరిశీలించారు. ఆదిలాబాద్ పట్టణంలో నోటీసులు అందుకున్న ఓటర్ల నుండి బూత్ స్థాయి అధికారులు పత్రాలను స్వీకరిస్తూ శిబిరాలను నిర్వహించారు. సుదర్శన్ రెడ్డి సంబంధిత గ్రామ పంచాయతీలలో బీఎల్ఓలు, ఓటర్లతో మాట్లాడారు. ఆయన దరఖాస్తులు, సర్వే ఫారమ్‌లు , ఓటర్ల జాబితాలను పరిశీలించారు. కొత్త ఓటర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల గురించి బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు . నిబంధనల ప్రకారం ఓటర్ల పేర్లు, వయస్సు , చిరునామాలలో ఉన్న తప్పులను సరిదిద్దాలని వారికి సూచించారు. ఇంటింటి సర్వేలో సేకరించిన సమాచారాన్ని ధృవీకరించిన తర్వాతే ఓటర్ల పేర్ల చేర్పులు , తొలగింపులు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పత్రాలను పరిశీలించి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారని సీఈవో తెలిపారు. ఓటరు వద్ద అవసరమైన పత్రాలు లేనప్పుడు ఏమి చేయాలనే దానిపై బీఎల్ ఓలకు తహసీల్దార్లు మార్గనిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు.
