ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే

అధికార పార్టీతో అమీ తుమీకి సిద్ద‌మైన ఎంకే స్టాలిన్

hellotelugu-MKStalin

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వులుకు రాజీనామా చేసి అధికార పార్టీ టీవీకేల చేరారు. దీంతో ఖాళీ అయిన ఆరు స్థానాల‌లో రెండు స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. దీంతో ఆయా పార్టీలు త‌మ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే ప‌నిలో ప‌డ్డాయి. ముందుగా ప్ర‌తిప‌క్ష పార్టీ పాత్ర పోషిస్తున్న డీఎంకే పార్టీ బాస్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అన్నా అరివాలయంలో సీనియర్ నాయకులతో సమావేశమైన ఆయ‌న ప‌లువురు నేత‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. ఈ మేర‌కు త‌మ పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. మధురాంతకం (ఎస్సీ) నియోజకవర్గానికి ఐ. పరాంతమన్, ధరాపురం (ఎస్సీ) నియోజకవర్గానికి ఎస్. సుకన్య . పుదుచ్చేరిలోని తట్టంచవడి నియోజకవర్గానికి సేతు సెల్వన్‌లను అభ్యర్థులుగా ప్రకటించారు.

ఇదిలా ఉండ‌గా టీవీకే పార్టీ గురువారం నాడు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించనుంది. కాగా అన్నాడీఎంకేకి చెందిన నూతన ప్రజా ప్రతినిధులు టీవీకేలో చేరేందుకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే అక్టోబర్ 6 ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులను నిలపదన్న ఊహాగానాలకు తెరదించుతూ, ఆ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని ఈ రెండు స్థానాలతో పాటు, రెండు నియోజకవర్గాల నుండి ఎన్నికై ఒక స్థానానికి రాజీనామా చేసిన కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ఖాళీ చేసిన పుదుచ్చేరి స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది. మ‌రో వైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఆ రెండు స్థానాలకు ఆశావహుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు.

Exit mobile version