అమరావతి : 2027 మార్చి నాటికల్లా రెవెన్యూ రికార్డులు పూర్తి కావాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు .సమస్య పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచనలు చేస్తే సుపరిపాలన అందించినట్టే. డబ్బులు లేవనడం కాదు, సంపద సృష్టికి పని చేయాలి… చేద్దాం అన్నారు. వెల్ఫేర్, డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్ అనేది ఓ సైకిల్ అని, అభివృద్ధి లేకుండా సంపద లేదన్నారు. సంపద లేకుండా సంక్షేమం లేదు. సూపర్ సిక్స్ పథకాలతో భద్రత, భరోసా కల్పించాం. పీ4తో ఆర్ధిక ప్రమాణాలు పెంచుతున్నాం. 26 కొత్త పాలసీలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ అంటే నమ్మకాన్ని కల్పించాం అని చెప్పారు సీఎం. రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాన్ని డ్రైవ్ చేయడమనేది గర్వంగా ఉండేది. కాలేజీ రోజుల్లో ఎన్ ఫీల్డ్ డ్రైవ్ చేయడాన్ని గొప్పగా ఫీలయ్యేవాళ్లం. అలాంటి రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థను ఏపీకి తెచ్చాం. రూ. 23 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నాం. ఇవి సాకారమైతే 24 లక్షల మేర ఉద్యోగాలు వస్తాయి.
గ్రీన్ ఎనర్జీతో పాటు గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్తున్నాం. డేటా, ఏఐ, క్వాంటం లాంటి టెక్నాలజీలకు ఏపీ కేంద్రంగా మారనుంది. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఏపీకి వచ్చాయి. రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన చేసుకోగలుగుతున్నాం. వేసవిలో దేశ ప్రజలను చల్లబరిచే ఏసీలు మన రాష్ట్రం నుంచే సరఫరా చేసే పరిస్థితికి వచ్చాం అని సీఎం వివరించారు. గత ప్రభుత్వం అనవసరంగా ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో పెట్టేసింది. కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రజలు విసిగిపోతున్న పరిస్థితి ఉంది. భూముల విషయంలో జీరో ఎర్రర్ రికార్డులు తయారు చేయాలి. రోడ్లు, వంతెనలు, ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.
















