హైదరాబాద్: గ్రామ పంచాయతీలు తమ నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయడానికి బదులుగా బ్యాంకులు , పోస్టాఫీసులలో ఉంచుకునే వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ‘తెలంగాణ పంచాయతీ రాజ్ (నాలుగవ సవరణ) బిల్లు, 2026’ను ప్రవేశ పెట్టింది. పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఇది ‘తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018’లోని సెక్షన్ 70(3)ని సవరించాలని ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం గ్రామ పంచాయతీల ద్వారా సమకూరే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయబడుతోంది, దీనివల్ల ఆ నిధులను తక్షణమే వినియోగించుకునే అవకాశం వాటికి ఉండటం లేదు.
ఈ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలు తమ నిధులను సమీపంలోని జాతీయీకరించిన బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసులలో ఉంచుకునేందుకు అనుమతి లభిస్తుంది. ఈ మార్పు వల్ల గ్రామ పంచాయతీలకు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని వాటికి, తమ నిధులు సులభంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, ఖజానా విధానంతో ముడిపడి ఉండే జాప్యం లేకుండా, స్థానికంగా సమకూరిన ఆదాయాన్ని అభివృద్ధి , అత్యవసర పనుల కోసం వినియోగించుకునే వెసులుబాటు సర్పంచ్‌లు , పంచాయతీ పాలకవర్గాలకు కలుగుతుంది. గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను మార్చాలని జూలై 17న రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సవరణను తీసుకు వచ్చారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క ఈ బిల్లు తీసుకు రావడం ఆనందంగా ఉందన్నారు.
