RBI : భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తాజా ద్రవ్య పరపతి సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించనున్నట్లు ఆర్బీఐ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, రెపో రేటు 5.5 శాతంగా కొనసాగుతుంది.
RBI Key Updates on Repo Rate
గవర్నర్ మల్హోత్రా వెల్లడించిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ విధానాల నేపథ్యంలో రెపో రేటును యథాతథంగా ఉంచాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ఈ అంశంపై ద్రవ్య పరపతి విధాన కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని చెప్పారు.
ఈ సందర్భంగా దేశ ఆర్థిక స్థితిగతులపై మల్హోత్రా విశ్లేషణ వెల్లడించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4 శాతంలో స్థిరంగా కొనసాగుతుండగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి అది 3.1 శాతానికి తగ్గొచ్చని అంచనా వేశారు. అలాగే, వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండొచ్చని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అస్థిరతలు కొనసాగుతున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలంగా ఉన్నాయని, వర్షపాతం సమృద్ధిగా నమోదవుతోందని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. వర్షాల ప్రభావంతో వ్యవసాయ ఉత్పత్తి మెరుగుపడతుందన్న ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. దీని ప్రభావంగా భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం మరింత దిగివచ్చే అవకాశం ఉందని MPC అంచనా వేసిందని వివరించారు.
గత నెలల్లో వడ్డీ రేట్లపై తగిన చర్యలు తీసుకున్న ఆర్బీఐ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి రెపో రేటును దాదాపు 1 శాతం మేర తగ్గించడం గమనార్హం. ఇక ముందు ఆర్థిక పరిస్థితులను పరిశీలించి అవసరమైతే మరిన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Gold Price Growth : స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు
