15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ లూలూ గ్రూప్ కు మంజూరు

కువైట్ స‌ర్కార్ కొత్త దీర్ఘ‌కాలిక నివాస అనుమ‌తి

hellotelugu-LuLuGroup

కువైట్ : కువైట్ స‌ర్కార్ తన మొట్టమొదటి 15 ఏళ్ల ‘గోల్డెన్ రెసిడెన్సీ’ని లూలూ గ్రూప్ అధినేత యూసుఫ్ అలీకి మంజూరు చేసింది. కువైట్ తన కొత్త దీర్ఘకాలిక నివాస అనుమతి (రెసిడెన్సీ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భారత దేశానికి చెందిన‌ బిలియనీర్ , లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అయిన యూసుఫ్ అలీ ఈ ప్రతిష్టాత్మక హోదాను పొందిన మొదటి వ్యక్తిగా నిలిచారు. కువైట్ సిటీలో జరిగిన కార్యక్రమంలో కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి , అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా ఈ నివాస అనుమతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సపోర్ట్ సెక్యూరిటీ సర్వీసెస్ యాక్టింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ఫవాజ్ అల్-రూమి కూడా పాల్గొన్నారు.

దేశ ఆర్థికాభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన ప్రముఖ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు , ఇతర వ్యక్తులను ఆకర్షించడానికి , వారిని ఇక్కడ కొనసాగేలా చేయడానికి రూపొందించిన కువైట్ ప్ర‌భుత్వం కొత్త దీర్ఘకాలిక నివాస విధానం అమ‌లు చేస్తూ వ‌స్తోంది. ఈ మొదటి ‘గోల్డెన్ రెసిడెన్సీ’ జారీతో అధికారికంగా ప్రారంభమైంది. గల్ఫ్ ప్రాంతంలోని అత్యంత ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన యూసుఫ్ అలీ, లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్ ద్వారా కువైట్ రిటైల్ రంగం , విస్తృత ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక నివాస హోదాను పొందిన మొదటి వ్యక్తి అయ్యారు. పెట్టుబడి వాతావరణాన్ని బలోపేతం చేయడం, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం , దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను గుర్తించడం వంటి లక్ష్యాలతో కువైట్ చేపట్టిన చర్యలలో భాగంగా ఈ కొత్త 15 ఏళ్ల ‘గోల్డెన్ రెసిడెన్సీ’ కార్యక్రమం ప్రారంభించారు.

Exit mobile version