Gold : శ్రావణమాసం ప్రారంభంతో పెళ్లిళ్ల సీజన్ ఊపందుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బంగారానికి దేశవ్యాప్తంగా గణనీయమైన డిమాండ్ నెలకొంది. పెరుగుతున్న వినియోగంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పుల ప్రభావంతో పసిడి ధరలు మరింత ఎగిసిపడ్డాయి. ఫలితంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు లక్ష రూపాయలను అధిగమించి, చరిత్రాత్మక గరిష్ట స్థాయిని నమోదు చేసింది.
Gold Price Updates
ఈరోజు ఉదయం (ఆగస్టు 6) 10:30 గంటల సమయంలో దేశవ్యాప్తంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (Gold) ధర రూ.1,01,230గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,794కి చేరింది. కొన్ని ప్రధాన నగరాల్లో ఈ ధరలు తక్కువగా ఉండగా, కొన్ని నగరాల్లో మరింతగా నమోదయ్యాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం (Gold) ధర రూ.1,01,040 కాగా, 22 క్యారెట్ల ధర రూ.92,620 వద్ద ఉంది. ముంబైలో కూడా ఇదే స్థాయిలో ధరలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ.1,01,180 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,748గా ఉంది. విజయవాడలో మాత్రం 22 క్యారెట్ల పసిడి ధర రూ.92,960గా ఉండడం విశేషం.
ఇక చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కతా, వడోదరా వంటి ఇతర నగరాల్లో కూడా బంగారం ధరలు స్వల్ప వ్యత్యాసాలతో లక్ష రూపాయల పరిధిలోనే కొనసాగుతున్నాయి. చెన్నైలో అత్యధికంగా రూ.1,01,330గా 24 క్యారెట్ల ధర నమోదవగా, 22 క్యారెట్ల ధర రూ.92,886గా ఉంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర కిలోకు సగటున రూ.1,13,000లకుపైగా ఉంది. కేరళలో అత్యధికంగా రూ.1,13,790కి చేరగా, చెన్నైలో రూ.1,13,710, హైదరాబాద్, విజయవాడల్లో రూ.1,13,560గా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో కూడా వెండి ధరలు ఇదే స్థాయిలో నమోదయ్యాయి.
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోళ్ల ఉత్సాహం, డాలర్ బలహీనత, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాలు బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తున్నాయని పేర్కొంటున్నారు. అంతేకాక, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో భద్రమైన పెట్టుబడి అవకాశాలవైపు ప్రజలు మరలుతున్నారని, దీని ప్రభావం గోల్డ్ ధరలపై స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
Also Read : Today Gold Price : రోజురోజుకు అందనంత ఎత్తుకు పసిడి ధరలు
