అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు . కూటమి సర్కార్ ను ఏకి పారేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ , జిల్లా పరిషత్ , మండల పరిషత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్ చోటు చేసుకోవడం దారుణమన్నారు. ఇవాళ జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎన్నిక ఏదైనా చివరకు టోటల్ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్ గా మార్చేశారంటూ వాపోయారు. గొర్రెతోలు కప్పుకున్న తోడేలు “నారా స్వామ్యం’’ అంటూ ఎద్దేవా చేశారు. నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’ జరగడం బాధాకరమని పేర్కొన్నారు. రాబోయే రోజులలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి తీసుకు వచ్చారన్నారు. ఇక ఎన్నికలు అంటే జడుసుకునేలా చేశారన్నారు జగన్ రెడ్డి.
నామినేషన్లు వేయ నీయకుండా వేసిన వాటిని అధికారులే చించేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశించినా ఎన్నికల సంఘం ఆచరణలో అభాసు పాలైందన్నారు .
పోలింగ్ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించడం చూస్తుంటే ఇక రాష్ట్రంలో డెమోక్రసీ ఉందా అన్నది అనుమానేనని అన్నారు జగన్ రెడ్డి. గెలిచిన వారిని కూడా ఓడి పోయారంటూ ప్రకటించడం చూస్తుంటే సిగ్గు వేస్తోందన్నారు. ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకోవడం దేశంలో ఎక్కడా లేదని ఒక్క నారా చంద్రబాబు నాయుడు పాలనలో కొనసాగుతోందన్నారు. అడ్డు కోవాల్సిన ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై జరిగిన హత్యా యత్నాలు చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు కాక మరేటిమని ప్రశ్నించారు . ఏకంగా పెద్దారెడ్డి ఇంటి మీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసుల ముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగు పట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించడం ఎక్కడా చూడలేదన్నారు.
