ముంబై : ‘ధురంధర్ 2’ ‘రామాయణం: పార్ట్ 1’ చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ తీవ్రతరమైంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు థియేటర్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. హిందీ వెర్షన్ నెట్ వసూళ్లలో ఈ రెండు చిత్రాల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. వీటి మధ్య వ్యత్యాసం కేవలం రూ. 75 లక్షలు మాత్రమే. అందిన సమాచారం ప్రకారం రెండవ శుక్రవారం నాడు ‘ధురంధర్ 2’ హిందీ వెర్షన్లో రూ. 37 కోట్ల నెట్ వసూళ్లను సాధించగా ‘రామాయణం: పార్ట్ 1’ రూ. 36.25 కోట్లను రాబట్టింది. ఈ వసూళ్లతో ‘ధురంధర్ 2’ అగ్రస్థానంలో నిలవగా ‘రామాయణం’ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ధురంధర్ మొదటి భాగం రూ. 30 కోట్లతో మూడవ స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ రూ. 24.75 కోట్లతో నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత ‘ఛావా’ రూ. 23 కోట్లతో, రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ రూ. 22.27 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ‘బాహుబలి 2’ రూ. 19.81 కోట్లతో ఏడవ స్థానంలో ఉండగా ‘గదర్ 2’ రూ. 19.62 కోట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ‘స్త్రీ 2’ చిత్రాలు వరుసగా రూ. 18.80 కోట్లు, రూ. 18.27 కోట్ల వసూళ్లతో టాప్ 10 జాబితాను పూర్తి చేశాయి.
హిందీ వెర్షన్లో బలమైన వసూళ్లతో పాట ‘రామాయణం: పార్ట్ 1’ మరో కీలకమైన బాక్సాఫీస్ మైలురాయిని అధిగమించింది. ఈ చిత్రం వరుసగా ఎనిమిది రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు సమాచారం. ఈ ఘనతతో, ఈ చిత్రం పలు భారీ భారతీయ బ్లాక్బస్టర్ సినిమాలను అధిగమించింది. ‘ధురంధర్ 2’, ‘పుష్ప 2’, ‘బాహుబలి 2’ ‘జవాన్’ చిత్రాలు వరుసగా నాలుగు రోజుల పాటు ఈ మైలురాయిని అందుకున్నాయి. ఆర్ఆర్ఆర్’ (RRR), ‘కల్కి 2898 ఏడీ’, ‘యానిమల్’ ‘కేజీఎఫ్ 2’ వంటి చిత్రాలు వరుసగా మూడు రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేశాయి. పఠాన్ వరుసగా రెండు రోజుల పాటు ఈ మైలు రాయిని సాధించింది. భారీ బడ్జెట్ భారతీయ చిత్రాలకు పెరుగుతున్న ప్రజాదరణను తాజా వసూళ్ల గణాంకాలు చూపిస్తున్నాయి. ధురందర్ 2 , రామాయణం: పార్ట్ 1 రెండూ ప్రేక్షకులను ఆకర్షిస్తూ కొత్త బాక్సాఫీస్ రికార్డులను సృష్టిస్తున్నాయి. హిందీ నికర వసూళ్లలో ధురందర్ 2 ముందంజలో ఉండగా రామాయణం తన ప్రపంచ వ్యాప్త వసూళ్లతో వార్తల్లో నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా కొనసాగే అవకాశం ఉంది.


















