చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు విశాల్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్ రంగానికి చెందిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. గురువారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించాడు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమిళ సినీ రంగంలో కలకలం సృష్టించాయి. చూసి, విని షాక్‌కు గురయ్యామని హీరో విశాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దిగ్గజ నటుడు కాంతారావుని ప్రశంసించడం అభినందనీయం అన్నారు. తమకు కూడా కాంతారావు అంటే వల్లమాలిన అభిమానం అని తెలిపారు విశాల్.
అయినప్పటికీ, అదే సందర్భంలో తమిళ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన, నటుడిగా మాత్రమే కాక నాయకుడిగా కూడా ప్రజల హృదయాల్లో నిలిచి పోయిన మహానుభావుడు ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్) పై చేసిన వ్యాఖ్యలు ఎంతోమంది భావోద్వేగాలను గాయపరిచాయని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక లెజెండ్‌ను పొగడటం కోసం మరో లెజెండ్‌ను తక్కువ చేయడం సరికాదని హితవు పలికారు రాజేంద్ర ప్రసాద్ కు. ఈ అంశంపై తగిన స్పందన, స్పష్టత లేదా క్షమాపణ అవసరమని ఆయన కోరారు. మంచి ఉద్దేశంతో, సానుకూల పరిష్కారం ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
