శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం

1990వ సంవ‌త్స‌రంలో ఉత్స‌వం ప్రారంభం

hellotelugu-Jestabhisehkam

తిరుమల : శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్టమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం మూడు రోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగి పోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవ‌త్స‌రంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఋత్వికులు శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణ సూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించారు. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులు వజ్ర కవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఇదిలా ఉండగా శనివారం ముత్య‌పు కవచంతో, ఆదివారం స్వర్ణ కవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈవో డాక్ట‌ర్ శ‌ర‌త్ , త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version