అమరావతి : ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వాటిలో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్ చేయగలుగుతున్నామని, ప్రాసెసింగ్ పెంచితే అధిక సంపదను ఆర్జించే ఆవకాశం ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రత్యేకించి యువత ఈ రంగంపై దృష్టి పెట్టాలి. ప్రతి కుటుంబంలో ఓ పారిశ్రామిక వేత్త రావాలి. మన వద్ద ఉత్పత్తి అయ్యే వాటిని గ్లోబల్ ప్రాడెక్ట్సుగా అభివృద్ధి చేయాలి. ఆహారపు అలవాట్ల అనుగుణంగా పంటలు కూడా మారాలి. నూజివీడు వద్ద ఇప్పుడు పామాయిల్, కోకో ఆక్వా లాంటి వాణిజ్య పంటలు పెరిగాయి. వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటల్లో మనం అగ్రగామిగా మారాం. వచ్చే 20-30 ఏళ్లలో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్ధిక వ్యవస్థ ఉండాలో మనం నిర్దేశించు కుందాం. రాయలసీమను కూడా ఉద్యాన పంటల హబ్ గా మార్చేలా కార్యాచరణ చేపట్టాం అన్నారు సీఎం.
రూ.1 లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను అభివృద్ధి చేస్తున్నాం. రూ.35 వేల కోట్లతో 36 సాగు ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తాం. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉన్నా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి పంటలను కాపాడాం. చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంత భవిష్యత్తు కూడా మారుతుంది. వెలిగొండ ప్రాజెక్టు ను ఈ నెలాఖరులోనే ప్రారంభించి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాకు నీరు ఇస్తాం. ఎల్ నినో వల్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంది. పప్పు ధాన్యాల లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చర్యలు చేపట్టాం. రైతులు కూడా సహకరించి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నీటి భద్రత సాధించి ప్రతి ఎకరాకూ నీరు ఇచ్చేలా చర్యలు చేపడతాం.
దేశం అంతా నదుల అనుసంధానం జరిగి నీటి సద్వినియోగం జరగాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన. గోదావరి- కృష్ణా, తుంగభద్ర, పెన్నా- కావేరీ నదులను అనుసంధానించటం ద్వారా 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. కష్టకాలంలో అన్ని ప్రాంతాల్లో ఆయకట్టు స్థిరీకరణ, తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. గంగా, మహానది, గోదావరి నదుల్ని కూడా అనుసంధానించుకుంటే వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోగలం. అప్పుడు దేశానికి తిరుగులేదు. నీటి భద్రత సాధిస్తే దేశ అభివృద్ధి అన్ స్టాపబుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
