కర్నూలు జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. కర్నూలు జిల్లా లోని ఆలూరు నియోజక వర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. నియోజక వర్గంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆలూరులో బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఇరిగేషన్ శాఖ మంత్రులకు పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులకుపై కనీసం అవగాహన సైతం లేదన్నారు. ప్రజల మెప్పు పొందేలా పాలిస్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్, ఆయన బ్యాచ్ ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. మెగా డీఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరగకపోయినా బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆలూరు నియోజక వర్గంలో కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు మంత్రిసవిత దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి కర్నూలు జిల్లా ఆలూరు నియోజక వర్గంలో మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీలకతీతంగా ఆలూరు నియోజక వర్గంలో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఒకవైపు సూపర్ సిక్స్ పథకాలు, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే నియోజక వర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కాలువల సహా ఇతర మౌలిక సదుపాయాలను విస్తృతంగా నిర్మిస్తున్నామన్నారు. బీసీల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అత్యధిక శాతం లబ్ది పొందుతున్నది బీసీలేనన్నారు. నియోజక వర్గంలో అత్యధిక మంది బీసీలు ఉన్నారని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆలూరులో బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
