తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి టీటీడీ తిరుపతి జేఈవో డాక్టర్ శరత్, డిఎఫ్‌వో ఫణి కుమార్ నాయుడు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగ నాయకుల మండపంలోని శేష వాహనంపై దర్భతో తయారు చేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల వరకు మీన లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజ స్తంభంపైకి గరుడ పతాకం ఎగుర వేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు.
ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో 200 కిలోల బరువైన దర్భ చాప, 250 మీటర్ల పొడవైన 100 కిలోల తాడు సిద్ధం చేశారు. దర్భ (కుశ గడ్డి) వేదోక్త శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడింది. ఋగ్వేదం “కుశాః పవిత్రా భవతు” అని దర్భను శుద్ధికరమైనదిగా చెప్పగా, యజుర్వేదంలో దర్భాసనంపై కూర్చొని చేసే ఉపాసన శ్రేష్ఠఫలితాలను ఇస్తుందని పేర్కొంది. శాస్త్రీయంగా చూసినా ఇందులో సిలికా అధికంగా ఉండటంతో వాతావరణ శుద్ధి, సూక్ష్మక్రీముల నిర్మూలన జరుగుతుంది. కాబట్టి వేదోక్త కర్మల్లో దర్భ వినియోగం, దైవిక వరమని భావించ బడుతుంది.



















