హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తుండడంపై మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని శుక్రవారం సందర్శించారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, తదితరులు. అంతకు ముందు సాయి ఈశ్వరాచారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల చెక్కును అందజేశారు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణన చేపట్టామన్నారు. కేంద్రం నుంచి ఆమోదం పొందితేనే బీసీ బిల్లు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఒక టీం కేంద్రం వద్దకు వెళుతుందని చెప్పారు. బీసీలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని కోరారు. సర్కార్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
