అమరావతి : పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుని ప్రజలకు సేవ చేయాలని నూతనంగా విధుల్లోకి అడుగు పెడుతున్న కానిస్టేబుళ్లకు సూచించారు. పోలీసు యూనిఫాం ప్రజల్లో భయాన్ని కాకుండా భరోసాను కల్పించేలా ఉండాలని అన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం 2025–26 బ్యాచ్‌కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను ఎన్నో అడ్డంకులను అధిగమించి పూర్తి చేశామని అన్నారు.
. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 శిక్షణ కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తయిందని తెలిపారు. వీరిలో 2,330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సుమారు 1,000 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండటం విశేషమన్నారు. విపత్తులు, బందోబస్తు, అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవాలని, సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు . పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని, వారికి సత్వర న్యాయం అందించేలా పనిచేయాలని సూచించారు. పోలీసులంటే ప్రజల్లో భయం కాకుండా భరోసా కలిగేలా వ్యవహరించాలన్నారు.
