మెగా డీఎస్సీ పారదర్శకతపై అనుమానాలకు తావులేదు

ప్రతి ఆరోపణకూ ఆధారాలతో సమాధానం చెబుతాం

hellotelugu-Atchannaidu

అమరావతి : కష్టపడి చదివి, క్రీడల్లో ప్రతిభ చాటి, నిబంధనల ప్రకారం మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మ గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బ తీయడం సరికాదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే నిరసన తెలియ జేయవచ్చు. ఆధారాలుంటే సంబంధిత సంస్థల ముందు ఉంచవచ్చు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. కానీ కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ‘ఫేక్’ అంటూ అవమానించడం, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం సమంజసం కాదన్నారు. విజయవాడలో ఉపాధ్యాయులపై దాడి జరిగిందన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవ‌ని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చర్యలు తీసుకుంటాం అని అచ్చెన్నాయుడు హెచ్చ‌రించారు.

శాప్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటనలు తీవ్ర ఆవేదన కలిగించాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మమ్మల్ని ఎందుకు ఫేక్ అంటున్నారని ఉపాధ్యాయులు వైసీపీ నేత‌ల‌ను ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పాల్సింది పోయి దాడుల‌కు దిగ‌డం దారుణ‌మ‌న్నారు . రాజకీయంగా విభేదించవచ్చు, వాదించవచ్చు. కానీ అది భౌతిక ఘర్షణలకు దారి తీయకూడద‌న్నారు. ముఖ్యంగా సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే గురువులు రాజకీయ ఘర్షణల్లో బాధితులుగా మారే పరిస్థితి రావడం బాధాకరం అన్నారు అచ్చెన్నాయుడు. మాజీ సైనికుడిగా దేశానికి సేవ చేసి, అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన వ్యక్తి కూడా ఈ వివాదంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న విషయం మరింత ఆవేదన కలిగిస్తోంది అని మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version