చెన్నై : మహిళల కోసం విస్తరించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలును సమీక్షించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈ కీలక పథకం ద్వారా రోజుకు సుమారు 84.32 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని, 12,692 నిర్దేశిత ప్రభుత్వ బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణించ వచ్చని పేర్కొన్నారు. అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘వెట్రి పయనం’ ఏర్పాట్లను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సమీక్షించారు. సాధారణ సిటీ , పట్టణ బస్సుల్లో ఇప్పటికే ఉన్న రాయితీలను విస్తరిస్తూ, ‘వెట్రి పయనం’ పథకం ఇప్పుడు కార్పొరేషన్ , మున్సిపల్ పరిధిలోని ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్ స్టాప్ సర్వీస్ , డీలక్స్ బస్సులకు, అలాగే 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే మోఫుసిల్ సాధారణ , ఘాట్ సాధారణ బస్సులకు కూడా వర్తింప చేయాలని ఆదేశించారు సీఎం.
ఏడు రాష్ట్ర రవాణా సంస్థలు నడిపే మొత్తం బస్సుల సంఖ్యలో ఈ నిర్దేశిత వాహనాలు 69 శాతం ఉన్నాయి. ఇవి రోజుకు 1,65,312 ట్రిప్పులను (సింగిల్ ట్రిప్స్) నిర్వహిస్తాయి, ఇది రాష్ట్ర మొత్తం బస్సు కార్యకలాపాలలో 85 శాతానికి సమానం. నిర్వహణ పరంగా చూస్తే, నిర్దేశిత బస్సులన్నింటిలో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషీన్ల ఏర్పాటు పూర్తయింది. సెప్టెంబర్ 25 నాటికి సిస్టమ్ పరీక్ష , ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జోసెఫ్ విజయ్. ఆ తర్వాత సెప్టెంబర్ 27న ట్రయల్ రన్ నిర్వహించ బడుతుంది. ఆగస్టు 24న అసెంబ్లీలో ప్రకటించిన ఈ పథకం, రవాణా ఖర్చుల కారణంగా మహిళలు, విద్యార్థినులు ఉపాధి లేదా విద్యా అవకాశాలను కోల్పోకుండా చూడటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
తద్వారా వారు కార్యాలయాలు, కళాశాలలు, అత్యవసర వైద్య సేవలను ఎటువంటి ఆటంకం లేకుండా పొందగలుగుతారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎ. విజయ్ తమిజన్ పార్థిబన్, ప్రధాన కార్యదర్శి ఎం. సాయికుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి (ఆర్థిక) ఎం. అసిథిక్, రవాణా శాఖ కార్యదర్శి ఇలా నితిర్మల్‌రాజ్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
