ఆరోగ్య రంగ ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణ

తీర్చి దిద్దడమే లక్ష్యం అన్న శ్రీధర్ బాబు

hellotelugu-SridharBabu

హైదరాబాద్ : ఆరోగ్య ప‌రంగా ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కేరాఫ్ గా తెలంగాణ‌ను మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు. సమాచార సాంకేతికత , అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ , స్టార్టప్‌ల రంగాల్లోని తమ బలాన్ని ఆరోగ్య సంరక్షణ రంగంతో అనుసంధానించడం ద్వారా రాష్ట్రాన్ని ఆరోగ్య రంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ‘బియాండ్ నంబర్స్ – ప్రిసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటిస్ అండ్ మెటబాలిక్ కేర్’ (మధుమేహం , జీవక్రియ సంబంధిత చికిత్సలో ఖచ్చితమైన ఫినోటైపింగ్) అనే ఇతివృత్తంతో ‘టి-హబ్’ లో నిర్వహించిన ‘HOMA CME 2026’ జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగు పరచడంలో , ప్రజారోగ్య సవాళ్లను ఎదుర్కోవడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, వాటిని విస్తృతం చేయడానికి వైద్య నిపుణులు, పరిశోధకులు, సాంకేతిక సంస్థలు, లైఫ్ సైన్సెస్ సంస్థలు , స్టార్టప్‌లను ఒకే వేదికపైకి తెచ్చేలా ఒక పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

మధుమేహం, ఇతర జీవక్రియ సంబంధిత రుగ్మతల భారం పెరుగుతుండటాన్ని ప్రస్తావించారు శ్రీ‌ధ‌ర్ బాబు. మారుతున్న జీవనశైలి ఇటువంటి సమస్యల పెరుగుదలకు కారణమవుతోందని అన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణలో సాంప్రదాయ వైద్య విధానాలకు డేటా , సాంకేతికత అదనపు బలాన్ని చేకూరుస్తాయని తెలిపారు. ఆరోగ్య రంగంలో తలెత్తుతున్న సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో వచ్చే కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి చెప్పారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి, విస్తృత ప్రజానీకానికి చేరే పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని వైద్యులు, పరిశోధకులు, సంస్థలు , సాంకేతిక కంపెనీలకు ఆయన పిలుపునిచ్చారు. వైద్యులు డాక్టర్ ముద్దు సురేంద్ర నెహ్రూ రచించిన ‘ది న్యూ పారాడిమ్’ పుస్తకాన్ని శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.

Exit mobile version