Coconut Water : కొబ్బరి నీరు సహజ ఆరోగ్య పానీయంగా విస్తృతంగా వినియోగించబడుతుంది. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహకరిస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, సోడియం, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల అనారోగ్యంతో బాధపడేవారికి కూడా ఇది మేలు చేస్తుందని చాలామంది నమ్మకం. అయితే, నేషనల్ కిడ్నీ ఫౌండేషన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, కొబ్బరి నీరు (Coconut Water) మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న వారికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు.
Coconut Water Effects
కిడ్నీ సమస్యలున్నవారు కొబ్బరి నీరు అధికంగా తీసుకుంటే రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి హైపర్‌కలేమియా అనే ప్రమాదకర పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇది గుండె స్పందనలో అవకతవకలు, కండరాల బలహీనత, కొన్ని సందర్భాల్లో పక్షవాతం వంటి సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ఉన్నవారు సహజంగానే పొటాషియం, ద్రవాల సమతుల్యతను నియంత్రించడంలో ఇబ్బంది పడతారు. అలాంటి పరిస్థితిలో కొబ్బరి నీరు తాగడం వారి ఆరోగ్యానికి హానికరమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
అధ్యయనం ప్రకారం, 240 మిల్లీలీటర్ల కొబ్బరి నీటిలో సుమారు 600 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. సాధారణ వ్యక్తులకు ఇది మేలు చేస్తుందిగానీ, కిడ్నీ సమస్యలున్నవారికి ఈ అధిక పొటాషియం శరీరంలో పేరుకుపోయి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల మూత్రపిండ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీరు తాగే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కొబ్బరి నీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అధిక మోతాదులో తీసుకుంటే శరీరానికి మేలు చేయకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
Also Read : Milk Price Drop : జీఎస్టీ రిఫార్మ్స్ తో తగ్గనున్న పాల ధరలు
