60 ల‌క్ష‌ల కిలోల క‌ల్తీ నెయ్యి కొనుగోలు : బీఆర్ నాయుడు

బేష‌ర‌తుగా జ‌గ‌న్ రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే

hellotelugu-TTDChairman

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న వైసీపీ పాల‌నా కాలంలో చోటు చేసుకున్న కల్తీ ల‌డ్డూ త‌యారీ వ్య‌వ‌హారంపై మండిప‌డ్డారు. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. తిరుప‌తిలో బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైన భంగం కలిగించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కమీషన్ల కోసమే కొన్ని డెయిరీల‌ను ఎంపిక చేశారని అన్నారు. హైంద‌వ‌ స‌మాజాన్ని నాశ‌నం చేయ‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. గ‌త 5 సంవ‌త్స‌రాల‌లో హిందూ దేవుళ్ళ‌ను, హిందూ స‌మాజాన్ని హేళ‌న చేశార‌ని, వారంతా హిందూ స‌మాజానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధమని ఆయన తెలిపారు. నెయ్యి నాణ్యతపై తుది నిజాలు వెలుగులోకి రావాలంటే మైక్రో డీఎన్ఏ టెస్ట్ తప్పనిసరిగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఖాతాల్లోకి వెళ్లిన కోట్ల రూపాయల లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని సిట్‌ను కోరారు. బ్యాంక్ ఖాతాలలో కోట్ల రూపాయలు జమ కావడం వాస్తవమా కాదా అని ప్ర‌శ్నించారు. బినామీల వెనుక అసలు పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, టిటిడి పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి రాజీ ఉండదని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

Exit mobile version