నాగర్ కర్నూల్ జిల్లా : ఉమ్మడి పాలమూరు జిల్లాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల మణిహారంగా ఉందన్నారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ సందర్బంగా ఆయన నాగర్ కర్నూల్ జిల్లా పెబ్బేరు, కొల్లాపూర్ , జటప్రోల్ , పెంట్లవెల్లి ద్వారా శ్రీశైలంకు వెళుతున్న కృష్ణా నది ఆనుకుని ఉన్న సోమశిల ను సందర్శించారు. ఈ సందర్బంగా ఎకో టూరిజం పార్కును పరిశీలించారు. అంతే కాకుండా సోమశిల నుంచి ఎకో పార్కు వరకు బోటులో విహారం చేశారు. వ్యూ పాయింట్ నుంచి కృష్ణానది, ప్రకృతి అందాలను వీక్షించారు జూపల్లి కృష్ణారావు. అటవీ, పర్యాటక శాఖ కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేసేందుకు ఓకే చెప్పారని తెలిపారు. ఎకో టూరిజానికి తెలంగాణ కేరాఫ్ గా మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇప్పటికే సాంస్కృతిక పరంగా, పర్యాటక రంగ పరంగా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగిందని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గతంలో ఏలిన సర్కార్ పర్యాటక, సాంస్కృతిక రంగాలను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కూటమి ప్రభుత్వం పూర్తిగా పాలసీని మార్చడం జరిగిందని తెలిపారు.
