విశాఖపట్నం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారిని ఆదుకుంటామని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా నిన్న జరిగిన ఈ దుర్ఘటనలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం హుటా హుటిన కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖకు వచ్చారు. విశాఖపట్నంలోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిని సందర్శించి, స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులను , వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో ఆయన అడిగి తెలుసుకున్నారు.
గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యుల ద్వారా తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ కొణిదల. వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఎవరూ ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్ని విధాలా వారికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గణేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. మరో వైపు కేంద్ర మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస్ వర్మ, కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు వంగలపూడి అనిత, నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.
