అమరావతి : ఏపీ డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను నోటిఫై చేయగా, అందులో 3 శాతం క్రీడా కోటా కింద 421 పోస్టులను కేటాయించినట్లు తెలిపారు క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. ఈ నియామక ప్రక్రియలో 3,600 మంది అభ్యర్థులు మొత్తం 5,326 దరఖాస్తులు సమర్పించగా, తుది ఎంపికలో 382 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయని, ఇంకా 39 పోస్టులు ఖాళీగా మిగిలి పోయాయని వెల్లడించారు. అన్ని పోస్టులు భర్తీ కాక పోవడమే ఎంపికలు పూర్తిగా అర్హత, ప్రాధాన్యత, ప్రభుత్వ నిబంధనల ఆధారంగానే నిర్వహించబడినట్లు స్పష్టం చేస్తోందన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తిస్థాయి వెబ్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో నిర్వహించినట్లు తెలిపారు. అభ్యర్థులు OTP ఆధారిత సురక్షిత ధృవీకరణతో తమ వ్యక్తిగత, విద్యార్హతలు, క్రీడా వివరాలను స్వయంగా పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.
అభ్యర్థుల అర్హతలకు అనుగుణంగా పోస్టులు ఆటోమేటిక్‌గా ప్రదర్శించబడే విధంగా వ్యవస్థను రూపొందించడం ద్వారా మానవ జోక్యానికి అవకాశం లేకుండా పారదర్శకతను నిర్ధారించామని తెలిపారు. జిల్లా, పోస్టుల వారీగా ఖాళీల వివరాలను పోర్టల్‌లో అందుబాటులో ఉంచి అభ్యర్థులు స్వయంగా పోస్టులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తు వివరాల డౌన్‌లోడ్, ప్రింట్ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయించగా, సంబంధిత సంఘాలు, ఫెడరేషన్లు, యూనివర్సిటీలు ,ఇతర అధికార సంస్థల ద్వారా వాటి నిజానిజాలను నిర్ధారించిన అనంతరమే తాత్కాలిక ప్రాధాన్యత జాబితాను రూపొందించినట్లు వెల్లడించారు. అదేవిధంగా, డీఎస్సీకి నిర్దేశించిన విద్యార్హతల విషయంలో ఎటువంటి సడలింపులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
