హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లింది కేంద్రం. ఈ నెల 3వ తేదీన ఎన్టీఏ ఆధ్వర్యంలో నీట్ యుజి 2026 పరీక్షను నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భారీ ఎత్తున హాజరయ్యారు. అష్ట కష్టాలు పడి చదివారు. రాజస్థాన్ లో నీట్ కు సంబంధించి పేపర్ లీక్ కావడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందడం, నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు దీనిపై విచారణకు సీబీఐని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
రాజస్థాన్ లో NEET పేపర్ లీక్ అయిందని నిర్ధారించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్ష రద్దు చేసినట్టు ప్రకటించడం చాలా దురదృష్టకరం అన్నారు. తెలంగాణ లో మైనర్ బాలికల పై కేంద్ర హోంమంత్రి మంత్రి తనయుడి దురాగతాల వార్తల నుండి కోలుకోక మునుపే ఈ నీట్ దుర్వార్త రావడం అత్యంత బాధాకరం అన్నారు. కేంద్రం బిజెపి పాలనలో ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి లీకులు జరిగాయి. అయినా కమల నాధుల తీరు మారలేదన్నారు ఆర్ఎస్పీ. వీళ్లకు వ్యాపారం, ఎన్నికలు, మత కల్లోలాల మీద ఉన్న శ్రద్ధ విద్య మీద ఉన్నదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ నేడు ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. విద్యార్థి లోకానికి ఇది ఒక చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు.
