రష్యా : భారత్ – రష్యా నడుమ ఒక అనిర్వచనీయమైన అనుబంధం ఉందన్నారు మంత్రి నారా లోకేష్. ఆయన రష్యాలో పర్యటిస్తున్నారు. ప్రపంచంలో ఇది చిరస్థాయిగా నిలబడిన స్నేహం. ఇది వ్యాపార ఒప్పందాలు, దౌత్య నిఘంటువులను మించినది. ప్రపంచం అనిశ్చితిలో ఉన్నప్పుడు కూడా ధృడంగా నిలబడిన బంధమని పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం వేదికగా జరిగిన రష్యా-ఇండియా బిజినెస్ ఫోరం సదస్సులో ప్రసంగించారు లోకేష్. భారతదేశ అభివృద్ధి యాత్రలో కీలక దశల వద్ద రష్యా భారత్ కు తోడుగా నిలిచిందన్నారు. భిలాయ్ స్టీల్ ప్లాంట్, కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం, గగన్యాన్, బ్రహ్మోస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రష్యా భారతదేశానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పునాది రాత్రికి రాత్రి నిర్మించడం సాధ్యమయ్యేది కాదన్నారు. దానిని కాపాడుకుంటూ మరింత బలంగా ఇరు దేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ ఫోరమ్‌లో మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు లోకేష్. నేను ఇక్కడకు రావడానికి కారకులైన భారత ప్రజలు, ప్రధాని నరేంద్ర మోడీజీకి ధన్యవాదాలు చెబుతూ వారి తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇది భారతదేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కేంద్రాల్లో ఒకటి, ప్రస్తుతం మా జీడీపీ సుమారు 215 బిలియన్ డాలర్లు కాగా, 2047నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు.
బోధనలు పక్కన బెట్టి వాస్తవ ఫలితాల గురించి నేను మాట్లాడతాను. మన రెండు దేశాల భాగస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణ మా రాష్ట్రంలోనే ఉంది. ఏపీలో రుసాల్ (RUSAL) సంస్థ 1.5 మిలియన్ టన్నుల పయనీర్ ఆల్యూమినియం ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టింది. మరో ప్రాజెక్టు నయారా ఎనర్జీ — భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీలలో ఒకటైన నయారాలో రోస్‌నెఫ్ట్ మెజారిటీ వాటాను కలిగి ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని వడినార్ రిఫైనరీ రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తుంది. దేశవ్యాప్తంగా 6,500కు పైగా ఇంధన కేంద్రాలు భారతీయ వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. ఇవి కేవలం ప్రకటనలు మాత్రమే కాదు . ఇవి ప్రస్తుతం అభివృద్ధి సాధిస్తున్న పారిశ్రామిక భాగస్వామ్యాలు. మనం ఇంకా చేయాల్సిన పనులకు ఇదొక నమూనా. భారత్ – రష్యా కలిసి ఇలాంటి మరిన్ని భాగస్వామ్యాలను ఏర్పరచుకోగలవని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
