ఏపీని స్వ‌ల్పంగా తాకిన రుతుప‌వ‌నాలు

రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ప్ర‌క‌ట‌న

hellotelugu-APIMD

అమ‌రావ‌తి : నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న 2-3 రోజులు రాష్ట్రంలో మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు . ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో కురిసే మొత్తం వర్షపాతం సాధారణ స్థాయి కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అయితే, స్థానిక వాతావరణ మార్పుల వల్ల కురిసే వర్షాలు ఈ లోటును కొంత మేరకు భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. కాకపోతే, ఈసారి రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు జైన్. అంటే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి, మరికొన్ని రోజుల పాటు వాతావరణం పొడిగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. రైతులు ఈ మార్పులను గమనించి, తదనుగుణంగా తమ పంట ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.

నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్-సెప్టెంబర్ 2026) ఆంధ్రప్రదేశ్ లో వర్షపాతం సూచనలు క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో ముఖ్యంగా పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, వైఎస్‌ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు. ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం పల్నాడు, మార్కాపురం, కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు రేపు శ్రీకాకుళం జిల్లాలో 12 మండలాలు, విజయనగరం 22, మన్యం 12, అల్లూరి1, పోలవరం 2, విశాఖ 1,కాకినాడ 8 మొత్తంగా 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

Exit mobile version