హైదరాబాద్ : సింగూర్ ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26 లోగా పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యాం సేఫ్టీ పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులు, ENC లు , ఇంజనీరింగ్ శాఖ ముఖ్య అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సింగూరు డ్యాం సేఫ్టీ పై రాష్ట్ర మంత్రులు చర్చించారు. డ్యామ్ సేఫ్టీ ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్యత అంశం అన్నారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన నిబంధనల మేరకు సింగూర్ డ్యాం ను పరిరక్షించాలని మంత్రులు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. సింగూరు డ్యామ్ సేఫ్టీ నిర్మాణ పనులపై టెక్నికల్ కమిటీని నియమించాలని సూచించారు.
ఆందోల్ నియోజకవర్గం లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం DPR లను శరవేగంగా రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను పనులకు ఉగాదిలోగా శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టాలని స్పష్టం చేశారు. సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26 లోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. సింగూర్ ప్రాజెక్టు సుందరీకరణ , పరిరక్షణ పనులను వెంటనే ప్రారంభించాలని అన్నారు. ఆందోల్ నియోజకవర్గం లో చిన్న నీటి ప్రాజెక్టులైన చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు.
