అమరావతి : ఏపీ రాష్ట్ర మహిళ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సుధారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేని జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు పట్టించు కోవాల్సిన పని లేదన్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరమూ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు మంత్రి. జగన్ రాజకీయం చేయాలని అనుకుంటే ముందు ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు.సొంత చెల్లెలు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తన గురించి బయట పెడుతున్న ఇంట్లో విషయాలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు గుమ్మడి సుధారాణి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలకు అసూయ ఎక్కువై, కడుపు మంటతో మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసిందీ చేసేదీ తామేనని అన్నారు . ఒక్క అవకాశం ఇస్తే ఉత్తరాంధ్రను, విశాఖను కబ్జా చేసి, ఎవరూ బతక లేకుండా ఆస్తులు లాక్కున్నారని ఆరోపించారు గుమ్మడి సుధారాణి. విశాఖ వాసుల మంచితనాన్ని దౌర్జన్యంగా దోచుకున్నారని వాపోయారు. రుషికొండను బోడికొండను చేయటంతో పాటు స్టీల్ ప్లాంట్ మూసి వేయించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వ్యాపారాలు, వ్యవహారాలను సర్వనాశనం చేసిన వారు ఇప్పుడు ఉత్తరాంధ్ర మంచి చెడుల గురించి మాట్లాడటానికి సిగ్గుపడాలి అని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ ను తిరిగి ఓపెన్ చేయించాం అని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థను చంద్రబాబు, లోకేష్ కృషితో వచ్చిందన్నారు. ఆ విషయం మరిచి పోతే ఎలా అని నిలదీశారు.















