Minister Atchannaidu : అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా సరఫరా, పంపిణీని ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి అవసరమైనంత యూరియా సమయానికి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో యూరియా (Urea) సరఫరా, పంపిణీ వ్యవస్థను పర్యవేక్షిస్తూ, ఎక్కడా కొరత తలెత్తకుండా తగినన్ని నిల్వలు సిద్ధం చేశామని, ఏవైనా అవకతవకలు లేకుండా రైతులకు నేరుగా యూరియా చేరేలా కఠిన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనమే ప్రభుత్వ లక్ష్యమని, యూరియా సరఫరాలో అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శక విధానాన్ని అమలు చేస్తూ, ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యూరియా సమృద్ధిగా లభ్యమవుతుందని, తప్పుడు కథనాలు, మాటలు నమ్మోద్దని సూచించారు.
Minister Atchannaidu Key Comments on Urea
యూరియా సరఫరా లో గత వైసిపి ప్రభుత్వం కన్నా 48,478 మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలించామనే వార్త పూర్తిగా అవాస్తవమని అన్నారు. గత ప్రభుత్వం లో మార్క్ ఫెడ్ ద్వారా సొసైటీలకు ఎరువుల సరఫరా నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం మార్క్ ఫెడ్ ను గాడిలో పెట్టి సొసైటీలకు అధిక మొత్తంలో యూరియా సరఫరా చేసి గ్రామీణ రైతాంగానికి అందుబాటులో ఉంచిన విషయం గుర్తించాలని తెలిపారు. గతానికి భిన్నంగా మార్క్ ఫెడ్ : ప్రైవేట్ పంపిణీ నిష్పతి ని 50 : 50 నుండి 70:30 పెంచామని, మార్కె ఫెడ్ ద్వారా (ఆర్ ఎస్ కే, పీఏసీఎస్) 20% ఎక్కువగా యూరియాను పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది దక్కుతుందన్నారు.
2021- 22 నుండి 2023 – 24 వరకు గత వైసిపి మూడు సంవత్సరాల సరాసరి యూరియా సరఫరా కేవలం 1,55,617 మెట్రిక్ టన్నులు కాగా ఈ ఒక్క సంవత్సరం (2025- 26)లో ఆగస్టు చివరి నాటికి 2,04,096 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేసామని చెప్పారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం యూరియా సరఫరా 31% శాతం గతం కంటే ఎక్కువ అని తెలిపారు. ఏ ఒక్క రైతుకు యూరియా అందని పరిస్థితి రాకూడదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షఅని, రైతు శ్రేయస్సు కూటమి ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు.
విజిలెన్స్ రెవెన్యూ అధికారుల నిరంతర నిఘా, క్రమం తప్పని తనిఖీల ద్వారా అందుబాటు ధరలోనే మార్కెట్ లో యూరియా లభిస్తుందని, ఎటువంటి బ్లాక్ మార్కెట్ లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపించి ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరపడం ద్వారా మన రాష్ట్రానికి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇతర రాష్ట్రాల కంటే అధిక మొత్తంలో యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఇప్పటివరకు గత ఏడాది కన్నా 87,880 మెట్రిక్ టన్నుల యూరియాను వివిధ పంటలకు రాష్ట్ర రైతాంగం వినియోగించిందన్నారు.
Also Read : Samshabad Airport – New Innovation : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈ శ్రామ్ నమోదు శిబిరం
