సింగపూర్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో పాల్గొని ప్రసంగించారు. లీడర్షిప్ ప్లీనరీ-2లో ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’ అనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్ల క్రితం ఐటీ గురించి మాట్లాడానని, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్‌తో ఈరోజు తెలుగు వాళ్లు తలసరి ఆదాయంలో ముందున్నారని చెప్పారు. ఇప్పుడు ఏఐ వచ్చిందన్నారు. నాడు సైబరాబాద్ అభివృద్ధి చేశామని, నేడు తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని, ఇదంతా తన వల్లే జరిగిందని చెప్పారు సీఎం. రాష్ట్ర విభజనతో మరో నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చిందని అన్నారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నాం అని ప్రకటించారు. పీపుల్ ఫస్ట్ మా విధానం అని , ఈక్విటీ, నేచర్, ఆపర్చ్యునిటీ, లివబుల్ సిటీగా అమరావతి ఉంటుందన్నారు.
అంతర్జాతీయ మౌలిక వసతులతో, అవకాశాల వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం అని తెలిపారు సీఎం. కృష్ణానది, ఇన్నర్ – ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జిలతో అద్భుతంగా అమరావతి రూపు దిద్దుకుంటోందని చెప్పారు. స్పోర్ట్స్, ఫైనాన్సియల్, నాలెడ్జ్, జస్టిస్, టూరిజం, హెల్త్, మీడియా వంటి వాటిని ఇక్కడే ఉండేలా చూశామన్నారు. ఒకే ఒక్క పిలుపుతో రాజధాని కోసం రైతులు 35 వేల ఎకరాలను అప్పగించారని, వారందరికీ తాము రుణపడి ఉంటామన్నారు సీఎం. వాటిలో కొంత భాగాన్ని అభివృద్ధి చేసి రైతులకు తిరిగి ప్లాట్లు ఇస్తున్నామని చెప్పారు . 21 కి.మీ పొడవునా వాటర్ ఫ్రంట్ నగరంగా అమరావతి ఉంటుందన్నారు.
సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, అండర్ గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్ జీరో లక్ష్యంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని అన్నారు సీఎం. సైబరాబాద్‌లో నాడు ఎకరం రూ.2 లక్షలు ఉంటే… నేడు రూ.200 కోట్లకు పెరిగిందన్నారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి సాధ్యమవుతుంది అనేందుకు సైబరాబాద్ నిదర్శనమని చెప్పారు. అమరావతిని నాలెడ్జ్ సిటీగా చేస్తున్నాం… జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు తీసుకు వస్తున్నాం అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ హబ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ఆకర్షణలుగా మారబోతున్నాయని తెలిపారు సీఎం. .అమరావతిని సందర్శించి… సరికొత్త ఆలోచనలతో అవకాశాలను వినియోగించు కోవాలని కోరారు.
