సింగపూర్ : సెమీ కండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్య స్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 30 రోజుల్లో ఏపీకి వచ్చి అమల్లో ఉన్న పాలసీలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్‌లో సెమీకాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని అన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్ట్రమని చెప్పారు సీఎం. పెట్టుబడులకు ఇది సరైన సమయమని సీఎం వ్యాఖ్యానించారు.
సెమీ కండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. రాయలసీమలో త్వరలోనే ఓ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. డిఫెన్సు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఫైటర్ జెట్‌ల తయారీ సహా ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా రాయలసీమ ప్రాంతంలో అవకాశాలున్నాయని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. సెమీ కండక్టర్లపై ఏర్పాటు చేసిన సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశానికి సింగపూర్ లోని వివిధ సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. గ్లోబల్ ఫౌండ్రీస్, ఎన్ఎక్స్ పీ, ఏఎస్ఎంపీటీ, ఒన్ సిస్టమ్ టెక్నాలజీస్, టెక్సెండ్ ఫోటోమాస్క్, ఆక్వాటెక్ తదితర సెమీకండక్టర్ తయారీ సంస్థలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాయి.
