Minister Atchannaidu : అనంతపురం జిల్లా : రాష్ట్రంలో యూరియాకు సంబంధించి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మంగళవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారని , కానీ తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక సీన్ మారిందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగు చేసిన రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా సరఫరా చేసి కొరతకు తెరదించిందన్నారు.
Minister Atchannaidu Key Comments Urea
సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ కారణంగా కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడటం వలన అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెండు రోజుల్లో రాష్ట్రానికి రానుందని వెల్లడించారు కింజారపు అచ్చెన్నాయుడు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఎక్కడా యూరియా సమస్య లేదన్నారు. వైసీపీ కావాలని రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. రబీకి 9.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. 130 కోట్లు ఖర్చు చేసి 7.37 లక్షల మంది రైతులకు విత్తనాలు రాయితీతో అందించడం జరిగిందన్నారు. వైసీపీ ఉచిత పంటల భీమా పేరుతో మోసం చేసిందన్నారు.
తమ ప్రభుత్వం రైతులకు సమయానికి పరిహారం అందిస్తోందని చెప్పారు మంత్రి. ఉల్లికి క్వింటాలుకు వైసీపీ రూ.770 మాత్రమే ప్రకటిస్తే తాము రూ.1200 మద్దతు ధర ప్రకటించి, అదే ధరకు కొనుగోలు చేస్తోందని చెప్పారు. టొమాటో, మామిడి, మిర్చి, కోకో, పొగాకు ధరలు పడిపోతే నేరుగా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు. పశు భీమా పరిహారం రూ.37,500 నుండి రూ.50,000/-కి పెంచి రైతులపై భారాన్ని తగ్గించామన్నారు.
మత్స్యకారుల భృతి రూ.10,000 నుండి రూ.20,000/-లకు పెంచి 1.21 లక్షల కుటుంబాలకు 242.8 కోట్లు చెల్లించడం జరిగిందని చెప్పారు. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50/- సబ్సిడీ రేటుతో విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్, ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా మార్చామన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో 46.86 లక్షల మంది రైతులకు రూ.3,174 కోట్లు చెల్లించామన్నారు.
Also Read : Minister Vasamshetty Fired on YSRCP : వైసీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు : వాసం శెట్టి
