మే 1 నుండి శ్రీ వేద నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

పోస్టర్లు, బుక్‌లెట్ ఆవిష్క‌రించిన టీటీడీ ఈవో ర‌విచంద్ర‌

hellotelugu-VedaNaraayanaSwamy

తిరుప‌తి : నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో మే 1 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్‌ను టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదివారం తిరుపతిలోని ఈవో బంగ్లాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని స్ప‌ష్టం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, మాడవీధుల్లో కూల్ పెయింట్‌, తాగునీటి సదుపాయాలు, ఎప్పటికప్పుడు నీటి పిచికారీ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రతిరోజు వాహన సేవల సందర్భంగా భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
అదనంగా మొబైల్‌ మరుగుదొడ్లు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, వాహన పార్కింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేపట్టాలని సూచించారు. భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కటాక్షానికి పాత్రులు కావాలని ఈవో కోరారు.

ఉత్స‌వాల సంద‌ర్బంగా వాహ‌న సేవ‌లు ఇలా ఉన్నాయి. మే1వ తేదీన ధ్వజారోహణం, పెద్దశేష వాహనం, 2వ తేదీన చిన్నశేష వాహనం, హంస వాహనం, 3వ తేదీన సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, 4వ తేదీన కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, 5వ తేదీన మోహినీ అవతారం, గరుడ వాహనం, 6వ తేదీన హనుమంత వాహనం, గజ వాహనం, 7వ తేదీన సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 8వ తేదీన రథోత్సవం, ఆర్జిత కల్యాణోత్సవం, అశ్వవాహనం, 9వ తేదీన‌ చక్రస్నానం, ధ్వజావరోహణం జ‌రుగుతుంద‌ని తెలిపారు ఈవో.

Exit mobile version