అమరావతి : పర్యాటకులు ఎక్కువ సమయం రాష్ట్రంలో గడిపేలా హోటళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మహీంద్రా క్లబ్ సంస్థ బీచ్ రిసార్ట్స్, పులికాట్ లేక్ వద్ద కూడా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అరకు లాంటి ప్రాంతాల్లోనూ ఐటీడీఏ భాగస్వామ్యంతో మహీంద్రా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. టెంపుల్ టూరిజంను ప్రోత్సహించేలా కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలను గుర్తించి వాటి వద్ద పెట్టుబడులు వచ్చేలా చూడాలన్నారు. తిరుపతి, అమరావతి, విశాఖలలో బాబా రామ్ దేవ్ యోగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు.
గండికోట, పోలవరం ప్రాజెక్టు, అనంతపురం, కర్నూలు వద్ద పెద్ద ఎత్తున హోటళ్లు రావాల్సి ఉందన్నారు సీఎం.. హార్సిలీ హిల్స్ వద్ద మంచి రిసార్టులు ఏర్పాటు చేస్తే టూరిస్టులు మరింతగా పెరుగుతారని చెప్పారు. సూర్యలంక బీచ్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అన్నారు. బెస్ట్ బీచ్ టూరిజం స్పాట్ గా సూర్యలంకను తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరిగేలా చర్యలు చేపట్టాలి. అమరావతిలో వచ్చే పెట్టుబడులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఓ కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. డిస్ట్రిక్ట్ కూలింగ్, పైప్డ్ గ్యాస్, విద్యుత్ లాంటివి పూల్ గా ఇచ్చే పరిస్థితి వస్తే ప్రాజెక్టుల వ్యయం తగ్గుతుందన్నారు.
