హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ సంస్థ ఎల్ అండ్ టి కి చెందిన రూ. 14 వేల కోట్ల అప్పు భారాన్ని ఎందుకు భరించాలని నిర్ణయం తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. ఈ అప్పు ప్రజలపై భారం కాదా అని నిలదీశారు. గతంలో, రాయదుర్గం నుండి విమానాశ్రయం వరకు మెట్రో లైన్ ఏర్పాటు చేయాలని తాము కేసీఆర్ ని కోరినప్పుడు, ఆయన దానిని రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా చేపట్టడానికి అంగీకరించారని తెలిపారు. ఆ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, రేవంత్ రెడ్డి వాటిని రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టే ప్రతి పథకం వెనుక ఒక కుంభకోణం దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
మెట్రోకు చెందిన 280 ఎకరాల భూమిని తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకే ఆయన ఎల్ అండ్ టి నుండి హైదరాబాద్ మెట్రో బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నారని మండిపడ్డారు. ఆయన ఖచ్చితంగా ఆ 280 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టి… తమ వారికి దక్కేలా చేస్తారన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీకి కూడా వాటా ఉందన్నారు. లక్డీకాపూల్ నుండి BHEL వరకు ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో విస్తరణను మోదీ ప్రభుత్వం ఎందుకు తిరస్కరించిందని నిలదీశారు.
అది ఆచరణ సాధ్యం కాదని చెప్పి, దానికి బదులుగా కాన్పూర్ వంటి చిన్న నగరాలకు , ఉత్తరప్రదేశ్‌లోని మరో 10 పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను ఎలా మంజూరు చేశారంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఈ నగరం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతుంటే కేంద్రం దానిని విస్మరిస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే దృష్టి సారిస్తున్నారని ధ్వజమెత్తారు.
