రూ. 36 కోట్ల వ్యయంతో 18 నగర వనాల అభివృద్ధి

ప్ర‌క‌టించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

hellotelugu-PawanKalyan

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌కృతిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. ఏ దేశమైతే ప్రకృతితో కలిసి ఎదుగుతుందో, ఆ దేశం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. ప్రకృతితో పాటు సాధించే అభివృద్ధే శాశ్వతంగా ఉంటుందని ఆ విష‌యం గుర్తు పెట్టుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. మన వారసత్వం అనేది కేవలం మనం నిర్మించిన కట్టడాలు కాకూడదని, మనం కాపాడిన ప్రకృతి అయి ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి , అనగాని సత్యప్రసాద్ , ఎస్. స‌విత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నగర వనాలు పట్టణాలకు గ్రీన్ లంగ్స్ లాగా పని చేస్తూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘నగర వన యోజన’ నిధులతో పాటు స్థానిక నిధులను సమకూర్చుకుంటూ రూ. 36 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేశాం అన్నారు. ఒక్కో నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో, రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించాం అని తెలిపారు. కొడూరు, కైలాసగిరి, మదనపల్లెలలో ప్రత్యేకంగా ఎర్రచందనం పరిరక్షణ పార్కులను ఏర్పాటు చేశామ‌న్నారు డిప్యూటీ సీఎం. మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ జ్ఞానాన్ని చాటి చెప్పేలా, జీవవైవిధ్య పరిరక్షణే ధ్యేయంగా నక్షత్ర వనాలు, రాశి వనాలను అభివృద్ధి చేశామ‌ని పేర్కొన్నారు. ఈ పార్కులు కేవలం పచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, ప్రజల శారీరక, మానసిక ఉల్లాసానికి కేంద్రాలుగా నిలవనున్నాయి. ఇందులో పక్షుల ఆవాసాలు, బోటింగ్, కయాకింగ్ (చిన్న పడవలు నడపడం), ట్రెకింగ్ పాయింట్లు, యోగా కేంద్రాలు, ఓపెన్ జిమ్‌లు వంటి ఎన్నో ప్రత్యేక ఆకర్షణలను అందుబాటులోకి తీసుకొచ్చాం అని తెలిపారు.

Exit mobile version